యువత ప్యాషన్ తో ముందుకెళ్లాలి.. జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల అలవర్చుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

యువత ప్యాషన్ తో ముందుకెళ్లాలి.. జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల అలవర్చుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • తెల్లాపూర్ లో సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
  • అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ సేవలు గొప్పవి
  • యువతకు ఇంగ్లిష్, జర్మన్ నేర్పించి, అక్కడ జాబ్స్ వచ్చేలా సర్కారు కృషి చేస్తోందని వెల్లడి  

రామచంద్రాపురం, వెలుగు :  సమాజంలో మార్పు తీసుకొచ్చి, పది మందికి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేపట్టాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రొఫెసర్ కంచ ఐలయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువతకు క్రమశిక్షణ, పట్టుదల, తపన ఉండాలని.. ఏదైనా నేర్చుకోవాలనే ప్యాషన్ అలవర్చుకోవాలని సూచించారు. తెల్లాపూర్ లాంటి ఏరియాలో రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారం చేయకుండా పేద విద్యార్థుల కోసం ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించడం ఎంతో గొప్ప విషయమని ఆస్క్ చైర్మన్ కొల్లూరి సత్తయ్యను అభినందించారు.

ఎలాంటి చదువు లేని వ్యక్తి సమాజానికి ఎదో ఒకటి తిరిగివ్వాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తుండడం గర్వకారణమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఇంగ్లిష్ తో పాటు జర్మన్ లాంగ్వేజ్ లో శిక్షణ అందించి, అక్కడ ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తోందన్నారు.

తన తండ్రి కాకా వెంకటస్వామి ఆ నాడు నాన్న చాలెంజ్ గా తీసుకొని ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్, కంపెనీలు పెట్టారని.. నేడు తాము విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అమృత సత్తయ్య సొసైటీ సేవా కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుంచి సహకారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

కాగా, ఇప్పుడు మంత్రిగా ఉన్న వివేక్ భవిష్యత్ లో సీఎం అవుతారని జేబీ రాజా వ్యాఖ్యానించగా, మంత్రి స్పందిస్తూ.. సీఎం కావాలన్న ఆశ తనకు లేదన్నారు. తన తండ్రి ఉన్నప్పుడు ఒక్కరోజైనా మంత్రి కావాలనే ఆశ ఉండేదని, అదిప్పుడు తీరిపోయిందని నవ్వుతూ సమాధానమిచ్చారు.

పేద పిల్లలకు ఉచిత శిక్షణ భేష్: కంచ ఐలయ్య   

దేశంలో పేద పిల్లలకు ఉచితంగా భోజనం పెట్టి, వసతి కల్పించి ఇంగ్లిష్ నేర్పిస్తున్న ఏకైక ఇనిస్ట్యూట్ ఆస్క్ అని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. పేద పిల్లలకు అవకాశాలు దొరకక ఎదగడం లేదని.. లేకపోతే అమెరికా, చైనా కంటే ఎక్కువ పతకాలు సాధించే సత్తా వారికుందన్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని, పేద, ఆదివాసీ వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే దేశం గర్వపడే విధంగా ఎదుగుతారని చెప్పారు.

ఆస్క్ జనరల్ సెక్రటరీ, మాజీ కౌన్సిలర్ భరత్ మాట్లాడుతూ.. ఒకటో తరగతి కూడా చదవని సత్తయ్య, ప్రపంచాన్ని చదివిన ఐలయ్య కలిసి స్థాపించిన ఆస్క్ భవిషత్ లో యూనివర్సిటీ గా ఎదుగుతుందని ఆకాంక్షించారు. సీ కాంప్లెక్స్ ద్వారా70 శాతం మంది పేద క్రీడాకారులకు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జగదీశ్వర్ గౌడ్, బీఎస్పీ కోఆర్డినేటర్ బాలయ్య, ఏసీపీ శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు, ఆస్క్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు